సీసీఐలో గోల్మాల్.. రైతులే బలి!
◆ పత్తి కొనుగోళ్లలో భారీ అవకతవకల ఆరోపణలు
◆ వ్యాపారులతో కుమ్మక్కై దళారీ వ్యవస్థకు ఊతం
◆ రైతుల పత్తికి కొర్రీలు.. దళారులకు గ్రీన్ సిగ్నల్
◆ ఏటా కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు
కాకతీయ, వరంగల్ : దేశవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లను నిర్వహించే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI)లో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రైతుల నుంచి నేరుగా పత్తి కొనుగోలు చేయాల్సిన సంస్థ, కొందరు బాధ్యుల చేతివాటంతో వ్యాపారులతో కుమ్మక్కై దళారీ వ్యవస్థకు మద్దతుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాల స్థాయిలో జరుగుతున్న ఈ అక్రమాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు సమాచారం. తెలంగాణలో విస్తారంగా పత్తి సాగు జరుగుతున్నందున సీసీఐ కొనుగోళ్లు పెద్ద మొత్తంలో జరుగుతుంటాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో సీసీఐ కార్యకలాపాలు కీలకంగా ఉన్నాయి. అయితే, ఇక్కడ కొందరు బాధ్యులు వ్యాపారులతో చేతులు కలిపి కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

వ్యాపారులతో కుమ్మక్కు ఆరోపణలు
సాధారణంగా రైతుల నుంచే నేరుగా పత్తి కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ, కొందరు రైతులు వివిధ కారణాలతో దళారులకు పత్తి విక్రయిస్తున్నారు. ఆ దళారులు, వ్యాపారులు సీసీఐ అధికారులతో కుమ్మక్కై పత్తిని కొనుగోలు చేయిస్తున్నట్లు సమాచారం. రైతుల నుంచి కొనుగోలు చేసే సమయంలో నాణ్యత పేరుతో అనేక ఆంక్షలు విధిస్తున్న సీసీఐ, వ్యాపారుల నుంచి మాత్రం అదే సరుకును ఎలాంటి అభ్యంతరాలు లేకుండా కొనుగోలు చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో భారీగా లోపాయికారితనం జరుగుతున్నట్లు మార్కెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రతి సీజన్లో కోట్ల రూపాయల లావాదేవీలు అక్రమంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రైతులకు తీరని అన్యాయం
సీసీఐలో జరుగుతున్న అవకతవకల వల్ల రైతులు కనీస మద్దతు ధర ప్రయోజనం పొందలేకపోతున్నారని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, వ్యాపారులకు మాత్రం సులభంగా కొనుగోళ్లు జరిపించడం వెనుక అవినీతి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించి సమగ్ర విచారణ చేపట్టాలని రైతులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


