అత్తాపూర్‌లో లాయర్ దారుణ హత్య
కార్యాలయంలోనే కత్తులతో దాడి చేసి హత్య
మొదటి భార్య తమ్ముళ్లపై పోలీసుల అనుమానం
ఘటనాస్థలంలోనే మృతి చెందిన అడ్వొకేట్ ఖదీర్
సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు
కాకతీయ, రంగారెడ్డి : హైదరాబాద్ అత్తాపూర్‌లో న్యాయవాది మహమ్మద్ ఖదీర్ దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం సులేమాన్‌నగర్‌లోని తన సొంత కార్యాలయంలో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు లోపలికి చొరబడి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఖదీర్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కార్యాలయంలో జరిగిన ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ కలహాలే కారణమా?
ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఖదీర్ మొదటి భార్య తమ్ముళ్లు (బావమరుదులు) ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. వ్యక్తిగత విభేదాలే హత్యకు దారితీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మొయినాబాద్‌లో మరో న్యాయవాది హత్య జరిగిన నేపథ్యంలో ఈ ఘటన నగరంలో మరింత ఆందోళనకు గురిచేసింది. న్యాయవాదిపై జరిగిన ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


