సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు ముగింపు
39లో 27 వార్డులు బీఆర్ఎస్ కైవసం
చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ
కాకతీయ,సిరిసిల్ల టౌన్ : మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పట్టణ రాజకీయాలు కొత్త దశలోకి ప్రవేశించాయి. మొత్తం 39 వార్డులున్న మున్సిపాలిటీలో 27 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మిగిలిన వార్డుల్లో ఇతర పార్టీల అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ, పాలన బాధ్యతలు బీఆర్ఎస్ చేతుల్లోనే ఉండనున్నాయి.
ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవుల ఎంపిక. చైర్‌పర్సన్ ఎంపికపై పార్టీ అధిష్టానం స్థాయిలో చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, గత అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వైస్ చైర్మన్ పదవి యువ నాయకత్వానికే..?
వైస్ చైర్మన్ పదవిని యువ నాయకత్వానికి ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 26వ వార్డు నుంచి గెలిచిన యువ కౌన్సిలర్ నరేష్ పేరు బలంగా వినిపిస్తోంది. పార్టీకి కట్టుబడి పనిచేసిన వ్యక్తిగా, యువతలో చురుకైన నేతగా గుర్తింపు పొందిన నరేష్ వైస్ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం.అయితే తుది నిర్ణయం మాత్రం పార్టీ అధిష్టానం చేతుల్లోనే ఉండనుంది. సీనియర్ నేతల మధ్య సైతం చర్చలు కొనసాగుతున్నాయి. కుల, వర్గ సమీకరణాలతో పాటు స్థానిక రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకునే అవకాశముంది.
పట్టణంలో ఉత్కంఠ…
పదవుల ఎంపికపై పట్టణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఊహాగానాలు కొనసాగనున్నాయి. కొత్త మున్సిపల్ బాడీ ఏర్పాటుతో పట్టణ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


