మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం
15 వార్డుల్లో 9 కాంగ్రెస్ ఖాతాలో.. చైర్‌పర్సన్ పీఠం హస్తగతం
బీఆర్‌ఎస్‌కు 5 వార్డులు, స్వతంత్ర అభ్యర్థికి 1 స్థానం
కాకతీయ, మరిపెడ : మరిపెడ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 9 వార్డుల్లో విజయం సాధించి స్పష్టమైన మెజార్టీని దక్కించుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ 5 వార్డులు గెలుచుకోగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితాలతో మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం స్పష్టమైంది. మున్సిపాలిటీలో వివిధ పార్టీలకు చెందిన 163 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, శుక్రవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని సెయింట్ అగస్టెంట్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన 15 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగి ఫలితాలు ప్రకటించారు.
వార్డుల వారీగా కాంగ్రెస్ ఆధిక్యం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 1, 3, 4, 6, 7, 8, 9, 14, 15 వార్డుల్లో విజయం సాధించారు. ముఖ్యంగా 15వ వార్డులో లూనావత్ రమేష్ 216 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, 6వ వార్డులో కాలం సునీత 151 ఓట్లు, 14వ వార్డులో జాటోతు సురేష్ 151 ఓట్లతో విజయం సాధించారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు 2, 5, 10, 11, 13 వార్డుల్లో గెలుపొందగా, 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి గౌతం రెడ్డి విజయం సాధించారు. కొన్ని వార్డుల్లో అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొన్నప్పటికీ, మొత్తంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగించింది.
కాంగ్రెస్ ఖాతాలో చైర్‌పర్సన్ పీఠం
మొత్తం 15 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకి 9 స్థానాలు రావడంతో చైర్‌పర్సన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. ఈ విజయంతో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. స్థానిక నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహిస్తూ విజయోత్సవాలు జరుపుకున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, ప్రజల ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని విజేతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఈ విజయం స్థానిక రాజకీయాల్లో కీలకంగా మారింది.


