సిరిసిల్ల గడ్డ కేటీఆర్ అడ్డ
మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా
39 వార్డుల్లో 27 వార్డులు కైవసం
కాకతీయ, సిరిసిల్ల టౌన్: “సిరిసిల్ల గడ్డ కేటీఆర్ అడ్డ” అన్న నినాదం మరోసారి ఘనంగా మార్మోగింది. సిరిసిల్ల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. పట్టణ ప్రజలు మరోసారి కారు గుర్తుకే మద్దతు తెలుపుతూ భారత రాష్ట్ర సమితికి స్పష్టమైన ఆధిక్యాన్ని అందించారు. మొత్తం 39 వార్డులకు గాను 27 వార్డులను కైవసం చేసుకుని బీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఫలితాలు వెల్లడైన వెంటనే పట్టణంలో గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
ఫలించిన కేటీఆర్ వ్యూహం
ఎలాగైనా మున్సిపల్ పీఠం దక్కించుకోవాలన్న లక్ష్యంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ వర్క్‌స్ట్రాటజీని సూటిగా అమలు చేయడం ఈ విజయానికి కీలకమైందని రాజకీయ వర్గాల విశ్లేషణ. వార్డు వారీగా సమీకరణాలు, అసంతృప్తులను చక్కదిద్దడం, స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం, ప్రత్యర్థుల బలహీనతలను సరిగ్గా అంచనా వేయడం ఇవి అన్నీ కలిసి గులాబీ పార్టీకి విజయం సాధించిపెట్టాయి.
కాంగ్రెస్‌కు నిరాశ
అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ కేవలం 6 వార్డుల్లో మాత్రమే గెలుపొందడం గమనార్హం. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పటికీ బలమైన పోటీ చూపించలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ 5 వార్డుల్లో గెలుపొందగా, 10వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బొలగం నాగరాజు విజయం సాధించారు.


