ఇష్టంతో చదివితేనే లక్ష్యం సాధ్యం
పదో తరగతి విద్యార్థులకు కానిస్టేబుల్ లోకేష్ ప్రేరణ
కాకతీయ, మరిపెడ : పదో తరగతి విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే ఉన్నత లక్ష్యాలను సాధించగలరని కానిస్టేబుల్ కొమ్ము లోకేష్ సూచించారు. శుక్రవారం మరిపెడ మండలం రాంపురం ప్రభుత్వ పాఠశాలలో తన జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి వార్షిక పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా లక్ష్యంతో చదవాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించి మిగిలిన సిలబస్ పూర్తి చేయాలని కోరారు. కష్టపడి చదివిన ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలుస్తారని అన్నారు. రాంపురం గ్రామాన్ని ఎస్ఎస్సి ఫలితాల్లో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు శశిధర్, గ్రామస్తులు లింగయ్య, సతీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


