నర్సంపేటలో హస్తం హవా
స్పష్టమైన మెజారిటీతో మున్సిపాలిటీ కైవసం
మొదటి రౌండ్ నుంచే కాంగ్రెస్ ఆధిపత్యం
ఛైర్పర్సన్‌గా పెండెం శ్రీలక్ష్మి ఖరారు
కాకతీయ, నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మొదటి రౌండ్ నుంచే ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 30 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 21 వార్డుల్లో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్‌ను దాటి చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 6 వార్డుల్లో గెలవగా, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్ 1 వార్డులో విజయం సాధించారు. ఈ ఫలితాలతో మున్సిపాలిటీపై కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యం సాధించింది.

ఛైర్పర్సన్‌గా పెండెం శ్రీలక్ష్మి ఖరారు
వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన కౌంటింగ్ మూడు దశల్లో ముగిసింది. మొదటి రౌండ్‌లోనే కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలు గెలుచుకుని ఆధిక్యం సాధించింది. రెండో రౌండ్‌లో మరో 5 స్థానాలు, మూడో రౌండ్‌లో 6 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీని నమోదు చేసింది. ఈ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని సునాయాసంగా దక్కించుకుంది. మున్సిపల్ చైర్పర్సన్‌గా పెండెం శ్రీలక్ష్మి రామానంద్ పేరును ఎన్నికల ప్రచారంలోనే ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో ఆమె చైర్పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించడం ఖాయమైంది. ఇక వైస్ చైర్మన్ పదవికి అధికార పార్టీలోనే తీవ్ర పోటీ నెలకొంది.
బీజేపీ, సీపీఎం బోణి
మున్సిపాలిటీలో బీజేపీ, సీపీఎం పార్టీలు కూడా ఖాతా తెరిచాయి. బీజేపీ తరఫున 28వ వార్డు నుంచి జూలూరు రోజారాణి విజయం సాధించారు. సీపీఎం మద్దతుతో 10వ వార్డు నుంచి హన్మకొండ శ్రీధర్ గెలుపొందడం విశేషంగా నిలిచింది. అలాగే 8వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి దొంగల రజిత విజయం సాధించారు. నర్సంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి తన ఆధిపత్యాన్ని మరొకసారి నిరూపించుకుంది.


