జనగామలో హంగ్..!
జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధిక్యం
30 వార్డుల్లో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 11 స్థానాలు
ఇండిపెండెంట్లు – 3, సీపీఎం – 1, బీఆర్ఎస్ రెబల్ – 1
చైర్పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ
కాకతీయ, జనగామ : జనగామ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం 30 వార్డుల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా 13 వార్డుల్లో విజయం సాధించి ముందంజలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 11 వార్డుల్లో గెలుపొందగా, ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక సీపీఎం అభ్యర్థి, ఒక బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో మున్సిపాలిటీలో స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో చైర్పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మొదటి వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సజ్జ దుర్గాప్రసాద్ గెలుపొందగా, రెండో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రామగల విజయ్ విజయం సాధించారు. మూడో వార్డులో సీపీఎం అభ్యర్థి బూడిద జ్యోతి గెలుపొందారు. నాలుగో, ఆరవ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మంత్రి సుమలత, బుక్క భరద్వాజ్ గెలిచారు. ఐదో వార్డులో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి మిద్దెపాక భాస్కర్ విజయం సాధించారు. ఏడో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సాజిద్ కమర్, ఎనిమిదో వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి సందుపట్ల మంజుల గెలిచారు.
బీఆర్ఎస్ ముందంజ – కాంగ్రెస్ గట్టి పోటీ
తొమ్మిదో, పదకొండో, పదమూడో, పదిహేడో, పద్దెనిమిదో, ఇరవయ్యో, ఇరవై ఒకటో, ఇరవై నాలుగో, ఇరవై ఆరవ, ఇరవై ఎనిమిదో, ఇరవై తొమ్మిదో వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. పదో, పన్నెండో, పద్నాలుగో, పదహారో, పంతొమ్మిదో, ఇరవై రెండో, ఇరవై ఐదో, ఇరవై ఏడో, ముప్పైవ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎనిమిదో, పదిహేనో, ఇరవై మూడో వార్డుల్లో విజయం సాధించి కీలక స్థానాల్లో నిలిచారు. సీపీఎం అభ్యర్థి మూడో వార్డులో గెలుపొందడం కూడా ప్రత్యేకంగా నిలిచింది. మొత్తం ఫలితాల్లో బీఆర్ఎస్ – 13, కాంగ్రెస్ – 11, ఇండిపెండెంట్లు – 3, సీపీఎం – 1, బీఆర్ఎస్ రెబల్ – 1 స్థానాలు దక్కించుకున్నాయి. మెజారిటీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 16 కాగా, ఏ పార్టీకి అది రాకపోవడంతో ఇండిపెండెంట్లు, ఇతరుల మద్దతు కీలకంగా మారింది.మొత్తం వార్డులు: 30 కాగా, మ్యాజిక్ ఫిగర్ : 16 ప్రస్తుత పరిస్థితి: హంగ్ – ఇండిపెండెంట్లు కీలకం. చైర్పర్సన్ ఎన్నికలో ఎవరి వైపు ఇండిపెండెంట్లు మొగ్గుచూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇరుపార్టీలు ఇప్పటికే మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. దీంతో జనగామ మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలు మరింత ఉత్కంఠగా మారాయి.
పార్టీ వారీగా స్థానాల వివరాలు
బీఆర్ఎస్ – 13
కాంగ్రెస్ – 11
ఇండిపెండెంట్లు – 3
సీపీఎం – 1
బీఆర్ఎస్ రెబల్ – 1


