ఎనిమిదో వార్డులో ఆశ్చర్యం…
స్వతంత్ర అభ్యర్థికి సున్నా ఓట్లు….
కుటుంబ సభ్యులే ఓటు వేయలేదా?
ములుగు మున్సిపల్ ఫలితాల్లో చర్చనీయాంశం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో ఎనిమిదో వార్డులో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఇమ్మడి పద్మకు ఓట్ల లెక్కింపులో ఒక్క ఓటు కూడా రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎన్నికల ముందు తన కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులు సహకారం ఉంటుందని భావించి పోటీలో నిలిచిన ఇమ్మడి పద్మకు ఫలితాల్లో మాత్రం నిరాశ ఎదురైంది. ముఖ్యంగా ఆమె కుటుంబంలో నలుగురు ఓటర్లు ఉన్నప్పటికీ ఒక్క ఓటు కూడా పడకపోవడం విశేషంగా మారింది. దీంతో “కుటుంబ సభ్యులే ఓటు వేయలేదా?” అనే చర్చలు స్థానికంగా మొదలయ్యాయి. ఎన్నికల సమయంలో ఆమెకు పెద్దగా ప్రచారం లేకపోవడం, ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండడం వల్ల ఓటర్లు ఆమె వైపు మొగ్గుచూపలేదని అభిప్రాయపడుతున్నారు. అయితే సొంత కుటుంబం నుంచే ఓటు పడకపోవడం మాత్రం ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో కూడా చర్చ సాగుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన వ్యక్తికి కనీసం ఒకటి లేదా రెండు ఓట్లు పడటం సాధారణమని, అయితే సున్నా ఓట్లు రావడం అరుదైన విషయమని పలువురు పేర్కొంటున్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ సంఘటన ములుగు పట్టణంలో చర్చకు దారితీస్తూ రాజకీయంగా ఆసక్తికర ఉదంతంగా మారింది.


