హుజురాబాద్‌లో కాంగ్రెస్ క్లియర్ కట్ ఆధిపత్యం
ప్రణవ్ వ్యూహాలకు ప్రజల మద్దతు
30లో 16 వార్డులు కాంగ్రెస్ ఖాతాలో
బీఆర్ఎస్, బీజేపీలకు ఎదురుదెబ్బ
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : హుజురాబాద్ పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం 30 వార్డుల్లో 16 స్థానాలను గెలుచుకుని మున్సిపాలిటీపై బలమైన పట్టు సాధించింది. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్ అమలు చేసిన వ్యూహాలు ఫలించడంతో ఈ విజయం సాధ్యమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రచారం నుంచి పోలింగ్ వరకు ప్రతి దశలో సమన్వయంతో పనిచేయడం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో 8 వార్డులకు మాత్రమే పరిమితం కావడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా మారింది. గతంలో బలమైన పట్టున్న ప్రాంతంలో ఈసారి ఆశించిన ఫలితాలు రాకపోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ 5 స్థానాల్లో విజయం సాధించి తన ఉనికిని చాటుకున్నప్పటికీ ప్రభావం పరిమితంగానే నిలిచింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
ఫలించిన ప్రణవ్ వ్యూహాలు
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో ప్రణవ్ అమలు చేసిన వ్యూహాలు కీలక పాత్ర పోషించాయి. బూత్ స్థాయి నుంచి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లడం, స్థానిక నాయకత్వాన్ని సమర్థంగా వినియోగించడం, ఓటర్లతో నేరుగా మమేకం కావడం వంటి అంశాలు విజయానికి కారణమయ్యాయి. ముఖ్యంగా ప్రతి వార్డులో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఓటర్లను ఆకర్షించేలా ప్రచారం నిర్వహించడం ఫలితాన్నిచ్చింది. ప్రచారం సమయంలో స్థానిక సమస్యలపై దృష్టి సారించడం, ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడడం, యువతను పార్టీలో చేర్చుకోవడం కాంగ్రెస్‌కు అదనపు బలం చేకూర్చాయి. ఫలితంగా కీలక వార్డుల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించారు.
బీఆర్ఎస్, బీజేపీ వెనుకంజ
బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. కేవలం 8 వార్డులకు మాత్రమే పరిమితం కావడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. స్థానిక స్థాయిలో పార్టీ నిర్మాణం బలహీనపడటం, కాంగ్రెస్ దూకుడు పెరగడం ఈ ఫలితాలకు కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ 5 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ మున్సిపాలిటీపై ప్రభావం చూపే స్థాయికి చేరుకోలేకపోయింది. కొన్ని వార్డుల్లో పోటీ ఇచ్చినా, మొత్తంగా కాంగ్రెస్ ఆధిపత్యాన్ని అడ్డుకోలేకపోయింది. ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించడం స్థానికంగా వ్యక్తిగత ప్రభావం ఇంకా కొనసాగుతున్నదనే సంకేతంగా భావిస్తున్నారు. హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి భారీ రాజకీయ బలాన్ని అందించాయి. ఈ విజయం నియోజకవర్గంలో పార్టీకి మరింత పట్టు పెంచడమే కాకుండా భవిష్యత్ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
పార్టీల వారీగా ఫలితాలు
కాంగ్రెస్ – 16
బీఆర్ఎస్ – 8
బీజేపీ – 5
ఇండిపెండెంట్ – 1
వార్డుల వారీగా గెలిచిన అభ్యర్థులు
1 – మ్యాకల స్వరూప (కాంగ్రెస్)
2 – సమీరా గఫర్ (బీఆర్ఎస్)
3 – గందే శ్రీనివాస్ (బీఆర్ఎస్)
4 – ప్రతాప తార (బీఆర్ఎస్)
5 – సొల్లు సునీత (కాంగ్రెస్)
6 – బండ సిందూజ (బీఆర్ఎస్)
7 – బండ నరేష్ (బీఆర్ఎస్)
8 – గూడూరు అంజలి (కాంగ్రెస్)
9 – ఇల్లందుల సమ్మయ్య (కాంగ్రెస్)
10 – కోలుగురి సుమలత (బీజేపీ)
11 – జున్నోతు భాస్కర్ (కాంగ్రెస్)
12 – వర్దినేని రవీందర్ రావు (బీఆర్ఎస్)
13 – సందమళ్ళ పుణ్య (కాంగ్రెస్)
14 – వజ్జెపల్లి వెంకటేశ్వర్లు (కాంగ్రెస్)
15 – బానోత్ వెంకట్ (కాంగ్రెస్)
16 – బండ వెన్నెల (కాంగ్రెస్)
17 – మహమ్మద్ కాలిద్ (కాంగ్రెస్)
18 – ప్రతాప మంజుల (బీఆర్ఎస్)
19 – గోస్కుల రాజ్‌కుమార్ (ఇండిపెండెంట్)
20 – దామర అనూష (బీజేపీ)
21 – పంజాల మనోజ్ (బీజేపీ)
22 – వడ్లూరి శ్రీలేఖ (కాంగ్రెస్)
23 – కాళీధస్ లక్ష్మి దుర్గ (బీజేపీ)
24 – నాంపల్లి శ్రీనివాస్ (కాంగ్రెస్)
25 – కొండా ప్రశాంతి (బీజేపీ)
26 – కేసిరెడ్డి లావణ్య (బీఆర్ఎస్)
27 – కోయాల్కర్ భారతి (కాంగ్రెస్)
28 – తాళ్లపల్లి రమేష్ (కాంగ్రెస్)
29 – బోరాగాల మొగిలి (కాంగ్రెస్)
30 – రొంటాల సుహాసిని (కాంగ్రెస్)


