వర్ధన్నపేటలో కాంగ్రెస్–బీఆర్ఎస్ సమాన పోరు..!
మొదటి వార్డులో కాంగ్రెస్ ఘన విజయం
నాలుగో వార్డులో భారీ మెజారిటీతో కాంగ్రెస్ జోరు
ఏడో, పదో వార్డుల్లో బీఆర్ఎస్ ఖాతా ఓపెన్
ప్రారంభ ఫలితాలతో ఉత్కంఠభరితంగా మారిన కౌంటింగ్
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్లో ప్రారంభ ఫలితాలు వెలువడుతున్నాయి. తొలి విడతలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో రెండు వార్డుల్లో విజయం సాధించడంతో పోటీ హోరాహోరీగా మారింది. ప్రతి వార్డులో స్వల్ప మెజారిటీలతో అభ్యర్థులు గెలుస్తుండటంతో మిగిలిన ఫలితాలపై ఆసక్తి పెరిగింది. మొదటి వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బెజ్జం పాపారావు 78 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యర్థిపై ఆధిక్యం సాధిస్తూ కాంగ్రెస్ ఖాతాను తెరిచారు. నాలుగో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నూనావత్ కమిలి మరింత భారీగా 125 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
బీఆర్ఎస్ కూడా బలమైన పోటీ
ఏడో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి తిరుపతి సురేష్ 86 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి పార్టీ ఖాతాను తెరిచారు. పదో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల అరుణ 54 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయాలతో బీఆర్ఎస్ కూడా పోటీలో వెనుకబడలేదని స్పష్టం చేసింది. మొత్తంగా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ప్రారంభ ఫలితాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీని సూచిస్తున్నాయి. మిగిలిన వార్డుల ఫలితాలు వెలువడిన తర్వాతే ఏ పార్టీ ఆధిపత్యం సాధిస్తుందో స్పష్టత రానుంది. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం వద్ద రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది.


