కౌంటింగ్‌లో కాంగ్రెస్ దూకుడు..!
మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ఆధిక్యం సంకేతాలు
జనగామ, పరకాలలో ఉత్కంఠభరిత లెక్కింపు
కొత్త మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ప్రతిష్టాత్మక పోరు
డోర్నకల్, కేసముద్రంలో కాంగ్రెస్ ఖాతా ఓపెన్
మొత్తం ఫలితాలపై ఉత్కంఠ కొనసాగింపు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మహబూబాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుండగా, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం కనిపిస్తున్నట్లు సమాచారం. పూర్తి ఫలితాలు వెలువడకపోయినా, కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జనగామ మున్సిపాలిటీలో కూడా 30 వార్డులకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి వార్డులో పోటీ తీవ్రంగా ఉండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. పరకాల మున్సిపాలిటీలో 22 వార్డుల కౌంటింగ్ కొనసాగుతుండగా, ఇప్పటివరకు ఒక వార్డులో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి ఖాతా తెరిచింది. ఇదే సమయంలో భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డుల లెక్కింపు కొనసాగుతుండగా, ఏ పార్టీ ఆధిక్యం సాధిస్తుందో తేలాల్సి ఉంది.
కొత్త మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జోరు
మరిపెడ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా, ఇప్పటికే ఒక వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి బోనీ కొట్టింది. కేసముద్రం మున్సిపాలిటీ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొత్తగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా, ఇప్పటివరకు ఒక వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మిగిలిన వార్డుల ఫలితాలపై ఆసక్తి పెరిగింది. దోర్నకల్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా, ఇప్పటికే రెండు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వరదన్నపేట మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగుతోంది. రెండు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండగా, మరో రెండు వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు, ఆధిక్యాలు పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దిశగా పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇంకా మిగిలిన వార్డుల ఫలితాలు వెలువడాల్సి ఉండటంతో తుది ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.


