జగిత్యాల జిల్లాలో అమానవీయ ఘటన
కుల బహిష్కరణ బాధితుడి అంత్యక్రియలకు పాడెమోయని గ్రామస్తులు
కాకతీయ, జగిత్యాల: జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాడె మోయడానికి గ్రామస్తులు ముందుకు రాకపోవడం తీవ్ర కలకలం రేపింది. కందనకుంట గ్రామానికి చెందిన ఎదుల రాజేశాన్ని కొంతకాలంగా కుల బహిష్కరణకు గురిచేసిన పెద్దలు అతను మృతి చెందడంతో పాడె మోయకూడదని గ్రామ సర్పంచ్‌తోపాటు కులపెద్దలు ఆజ్ఞాపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామస్తులు మాత్రమే కాకుండా దూరపు చుట్టాలు కూడా పాడె మోయరాదని స్పష్టంగా చెప్పినట్లు బాధిత కుటుంబ సభ్యుల సమాచారం. పాడె మోయాలని సర్పంచ్, పెద్దలను కాళ్లకు మొక్కి వేడుకున్నా వారు కనికరం చూపలేదని తెలిపారు. ఈఘటనతో మృతుడి శరీరాన్ని ముట్టుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరకు అతని భార్య, అక్కలు, సొంత కుటుంబ సభ్యులే పాడె మోయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ సంఘటన గ్రామంలో కుల వివక్ష ఎంత లోతుగా ఉందో మరోసారి బయటపెట్టింది. మానవత్వాన్ని మరిచిపోయేలా జరిగిన ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


