గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణపై ఆర్బిట్రేషన్
భూములు కోల్పోయిన రైతులతో కలెక్టర్ చర్చలు
పరిహారం, సాంకేతిక అంశాలపై సమీక్ష
సంగెం మండలానికి చెందిన 8 మంది రైతుల సమస్యల పరిష్కారం
నిబంధనల ప్రకారం రైతులకు న్యాయం చేస్తామని హామీ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేసే దిశగా జిల్లా యంత్రాంగం చర్యలను వేగవంతం చేసింది. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో సంగెం మండలానికి చెందిన రైతులతో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. హైవే నిర్మాణానికి సంబంధించిన భూసేకరణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిహారం చెల్లింపు, ఇతర సాంకేతిక అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా రైతులు తమ అభ్యంతరాలు, పరిహారం విషయంలో ఉన్న సందేహాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. భూసేకరణ ప్రక్రియ పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైతులకు న్యాయం చేయడమే లక్ష్యం
ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ, సంగెం మండలానికి చెందిన 8 మంది రైతుల ఆర్బిట్రేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. భూ సేకరణలో రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి రావాల్సిన పరిహారం, ప్రయోజనాలను అందజేస్తామని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే 163జి నిర్మాణం రాష్ట్రానికి, జిల్లాకు కీలక ప్రాజెక్ట్ అని కలెక్టర్ పేర్కొన్నారు. అయితే అభివృద్ధితో పాటు రైతుల ప్రయోజనాలను కూడా సమానంగా కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ఆర్బిట్రేషన్ ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించి, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సమావేశంలో వరంగల్ ఆర్డీవో సుమ, సంగెం తహసిల్దార్ రాజ్‌కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు విశ్వప్రసాద్‌తో పాటు సంబంధిత గ్రామాల రైతులు పాల్గొన్నారు. భూసేకరణకు సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించి, రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు


