కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత
450 మంది పోలీసులతో మూడంచెల బందోబస్తు
163 బీఎంఎస్ఎస్ అమలు
విజయోత్సవ ర్యాలీలకు నిషేధం
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
కాకతీయ, జగిత్యాల: జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రంగా ఏర్పాటు చేసిన ఎస్‌కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీ వద్ద భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి పరిశీలించారు.
లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 450 మంది పోలీసులతో మూడంచెల భద్రత కల్పిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. కేంద్రం పరిసర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబు నిర్వీర్య దళాలతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతల దృష్ట్యా 163 బీఎంఎస్ఎస్ (144 సెక్షన్) అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ఆదేశాలు నేడు ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ కాలంలో ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, టపాకులు కాల్చడం, సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన గుర్తింపు కార్డులు కలిగిన వారినే లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు రఘుచందర్, రాములు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.


