కార్మికుల హక్కులు కాపాడాలి
కాకతీయ, కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఆస్పత్రి వర్కర్స్ & ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల చౌరస్తా నుంచి కోర్టు వరకు ర్యాలీ చేపట్టి అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు బండారి శేఖర్ మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఒక నెల వేతనాలను వెంటనే చెల్లించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరారు. కనీస వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయించడంతో పాటు స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని అన్నారు. నూతన జాతీయ విత్తన చట్టం, విద్యుత్ (సవరణ) బిల్లు–2025, ఇన్సూరెన్స్ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐ అమలు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించవద్దని పేర్కొన్నారు. ఎం.వి. యాక్ట్–2019లో సవరణలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. టీయూసీసీ ట్రేడ్ యూనియన్ కో–ఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు పి. అరుణ్, కార్యదర్శి కళావతి, నాయకులు రాజు, స్వరూప, రాజయ్య, శేఖర్, సంపత్, రమేష్, తిరుపతి తదితరులతో పాటు సుమారు 100 మంది కార్మికులు పాల్గొన్నారు.


