విద్యుత్ తీగలపై చెట్లు..
తరుచూ విద్యుత్ సరఫరాకు ఆటంకం
మంటలు చెలరేగుతున్నాయని కాలనీవాసుల ఆందోళన
కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని రైతు వేదిక సమీపంలో ఉన్న భారీ జామాయిల్ చెట్టు స్థానికులకు ప్రమాదకరంగా మారింది. గత కొన్ని రోజులుగా గాలి దుమారం వచ్చినప్పుడు చెట్టు కొమ్మలు విద్యుత్ తీగలకు తగులుతూ స్పార్కింగ్తో మంటలు చెలరేగుతున్నాయని కాలనీవాసులు తెలిపారు. దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ చెట్టు ఎప్పుడైనా విరిగి రైతు వేదికపై లేదా సమీపంలోని ఇళ్లపై పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ తీగలకు తగులుతున్న కొమ్మల వల్ల అగ్ని ప్రమాదం సంభవించే అవకాశముందని పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు విద్యుత్ శాఖ, మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని, పెద్ద ప్రమాదం జరగకముందే చెట్టు కొమ్మలను తొలగించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు


