నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు చేయాలి
పాత 29 కార్మిక చట్టాలను కొనసాగించాలి
మణుగూరులో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకుల ధర్నా
కాకతీయ, మణుగూరు : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేసి, పాత 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం మణుగూరు ప్రాంతంలోని వివిధ రంగాల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. కార్మికుల శ్రమను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని నాయకులు ఆరోపించారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను హరించేలా ఈ కోడ్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. లేబర్ కోడ్‌లను రద్దు చేసేంతవరకు రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామని, రైతాంగ పోరాట స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యంగా ముందుకు సాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఆర్. మధుసూదన్ రెడ్డి, వెలగపెల్లి జాన్, గడ్డం వెంకటేశ్వర్లు, జి. శ్రీను, ఏ. చంద్రం, పి. భద్రం తదితరులు పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా సమ్మెకు మద్దతు ప్రకటించింది.


