వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు
నర్సంపేటలో 85.21%, వర్ధన్నపేటలో 86.23% పోలింగ్ నమోదు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద వెల్లడించారు. నర్సంపేట మున్సిపాలిటీలోని 30 వార్డుల పరిధిలో 60 పోలింగ్ కేంద్రాల్లో 85.21 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 40,968 మంది ఓటర్లలో 34,908 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డుల పరిధిలో ఉన్న 20 పోలింగ్ కేంద్రాల్లో 86.23 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 10,526 మంది ఓటర్లకు గాను 9,077 మంది ఓటు వేశారు. రెండు మున్సిపాలిటీల్లోని మొత్తం 80 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. గుర్తించిన ఆరు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా 17 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించి ప్రశాంత పోలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య సంబంధిత స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఎన్నికల నిర్వహణలో సహకరించిన అధికారులు, పోలీస్ సిబ్బంది, ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలకు కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు


