యూరియా కోసం రైతులు రోడ్డెక్కే దుస్థితి
ఎన్నికల మోజులో రైతులను మర్చిపోయింది రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎన్నికలు, రాజకీయాలపైనే దృష్టి పెట్టి రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, శంకరపట్నంలో యూరియా అందక రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. ఎరువుల సరఫరా విషయంలో ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. గత పంట కాలంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుండటం ఆందోళనకరమన్నారు. యూరియా పెద్దఎత్తున పక్కదారి పట్టి బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నదని, లోడ్ల కొద్దీ ఎరువు పట్టుబడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ అక్రమాలకు కాంగ్రెస్ నాయకులే కారణమని, రైతుల అవసరాలను వ్యాపారంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు అవసరమైన సమయంలో ఎరువు అందించలేకపోతే అది రైతు ద్రోహమేనని స్పష్టం చేసిన ఆయన, యూరియా సరఫరా వ్యవస్థను కట్టుదిట్టం చేసి తక్షణమే రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి సమస్యకూ కేంద్రాన్ని నిందించడం మానుకుని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. “పర్యవేక్షణ ఎక్కడ? నియంత్రణ చర్యలు ఏమిటి? రైతులను ఆదుకునే కార్యాచరణ ఏంటి?” అని ప్రశ్నించిన బండి సంజయ్, రైతులు నష్టపోతే తెలంగాణ రాష్ట్రానికే నష్టం అని హెచ్చరించారు.


