అక్రమంగా మట్టి తరలింపుపై కేసు నమోదు
మూడు ట్రాక్టర్లు, జేసీబీ సీజ్
కాకతీయ, గీసుగొండ : గీసుగొండ మండలంలో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ముగ్గురు ట్రాక్టర్లు, ఒక జేసీబీని స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపారు. సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం… మండలంలోని మరియాపురం గ్రామానికి చెందిన దుగ్గెంపూడి ప్రశాంత్ రెడ్డి భూమిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా జేసీబీతో మట్టి తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై అప్రమత్తమైన గీసుగొండ ఏఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తూ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ మూడు ట్రాక్టర్లు, ఒక జేసీబీ ద్వారా అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనదారులను అనుమతి పత్రాలు చూపించమని కోరగా, వారు ఎలాంటి అధికారిక డాక్యుమెంట్లు సమర్పించలేకపోయారు. దీంతో వెంటనే వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ వ్యవహారానికి సంబంధించి నలుగురిపై మైనింగ్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ తెలిపారు. అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపులపై కఠిన చర్యలు తప్పవని, ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడినా చట్టప్రకారం వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.


