నాగసుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేష పుష్పాలంకరణ
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
కాకతీయ, గీసుగొండ : ప్రసిద్ధి చెందిన ఊకల్ హవేలీ గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనా చార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని వివిధ రకాల పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఈ విశేష అలంకరణలో దర్శనమిచ్చిన నాగసుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్యరూపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణం మంత్రోచ్ఛరణలు, భక్తుల నామస్మరణతో భక్తిమయంగా మారింది. ఈ సందర్భంగా అర్చకులు భక్తులకు ఆశీర్వచనాలు అందజేసి, ధర్మాచరణ, భక్తి మార్గం ప్రాధాన్యతను వివరించారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ఉప అర్చకులు శ్రీహర్ష, ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, కమిటీ సభ్యులు, స్థానిక గ్రామ పెద్దలు పాల్గొన్నారు. భక్తుల సహకారంతో కార్యక్రమాలు ప్రశాంతంగా సాగాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.


