ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు
ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి
8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం
అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా
రూ.3 కోట్లకు పైగా నగదు, మద్యం స్వాధీనం
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి
కాకతీయ,హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి.శివధర్ రెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లను ఆయన వివరించారు. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరగేందుకు విస్తృత భద్రతా చర్యలు తీసుకున్నామని డీజీపీ స్పష్టం చేశారు. మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ భద్రత కల్పించామని, వీటిలో 1,302 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 1,926 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు. పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామని, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వెలుపల కూడా సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు 3 వేల మంది అదనపు బలగాలను రంగంలోకి దించామని, ఇందులో టీజీఎస్పీతో పాటు అటవీ, ఎక్సైజ్, సీఐడీ, లీగల్ మెట్రాలజీ విభాగాల సిబ్బంది కూడా భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు.
సైలెన్స్ పీరియడ్‌లో కఠిన నిఘా
సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారం ముగియడంతో సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చిందని డీజీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో విజిబుల్ పోలీసింగ్‌ను పెంచి గస్తీని ముమ్మరం చేశామని చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన జనవరి 27 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు రికార్డు స్థాయిలో తనిఖీలు నిర్వహించి, రూ.3.09 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో రూ.1.29 కోట్ల నగదు, రూ.1.21 కోట్ల విలువైన మద్యం, రూ.15.7 లక్షల విలువైన మాదకద్రవ్యాలు, రూ.28.69 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయని వివరించారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులు, జిల్లాల సరిహద్దుల్లో 55 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇందుకోసం 181 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 167 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని చెప్పారు.
ముందస్తు చర్యలతో అప్రమత్తత
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని డీజీపీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,183 లైసెన్స్డ్ ఆయుధాలను డిపాజిట్ చేయించామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 4,318 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. వివిధ కేసుల్లో పెండింగ్‌లో ఉన్న 398 నాన్‌బెయిలబుల్ వారెంట్లను అమలు చేశామని, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటివరకు 142 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణపై క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చామని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, భయం లేకుండా తమ రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ ఎం. భగవత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


