కనీస పెన్షన్ రూ.9,000 అమలు చేయాలి
పెండింగ్ డీఏ వెంటనే విడుదల చేయాలని డిమాండ్
కరీంనగర్ ఈపీఎఫ్ కార్యాలయం ముందు టాప్రా ధర్నా
కాకతీయ, కరీంనగర్ : ఈపీఎస్–95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9,000 అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) కరీంనగర్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఆల్ ఇండియా యునైటెడ్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఈపీఎస్ పెన్షనర్స్ అసోసియేషన్స్ పిలుపుమేరకు సోమవారం కరీంనగర్ ఈపీఎఫ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ, నిత్యావసర ధరల పెరుగుదలతో ఈపీఎస్–95 పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస పెన్షన్ను రూ.9,000కు పెంచడంతో పాటు పెండింగ్ డీఏను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2014లో జారీ చేసిన నోటిఫికేషన్–609ను రద్దు చేయాలని, గరిష్ట పెన్షన్ పరిమితిని పెంచాలని కోరారు. పెన్షనర్లకు ఉచిత వైద్యం, రవాణా సౌకర్యాలు కల్పించాలని, పెన్షన్ నిధుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఈపీఎఫ్ కమిషనర్ మొహమ్మద్ పసి ఉద్దీన్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పలువురు టాప్రా నాయకులు పాల్గొన్నారు.


