ఎన్నికలకు పకడ్బందీ భద్రత
పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
పెద్దపల్లి డీసీపీ బి.రామ్‌రెడ్డి
కాకతీయ, రామగుండం : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రశాంతంగా, నిస్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పెద్దపల్లి డీసీపీ బి.రామ్‌రెడ్డి తెలిపారు. గోదావరిఖని రెడ్డి భవన్‌లో పోలీసు సిబ్బందికి నిర్వహించిన బ్రీఫింగ్‌లో ఆయన మాట్లాడారు. పోలింగ్ ప్రారంభం నుంచి బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌కు చేరే వరకు ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 100 మీటర్ల లోపల అనుమతి లేని వ్యక్తులను అనుమతించరాదని, సెల్‌ఫోన్లు, నిషేధిత వస్తువులు లోపలికి తీసుకురాకుండా తనిఖీలు చేయాలన్నారు.
ఎక్కడైనా సమస్యాత్మక పరిస్థితులు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని, రూట్ మొబైల్ టీమ్‌లు వేగంగా స్పందించాలని సూచించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక భద్రత చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఏసీపీ రమేష్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


