సైలెన్స్ ప్లీజ్..!
మునిసిపల్ ప్రచారానికి తెర!
చివరి రోజున హోరెత్తిన ఎన్నికల ప్రచారం
అసెంబ్లీ ఎన్నికలను తలపించిన ప్రచార పర్వం
భూపాలపల్లిలో కేటీఆర్ రోడ్ షో హైలైట్
12 మున్సిపాలిటీల్లో 11న పోలింగ్
బరిలో 1,072 మంది అభ్యర్థులు
కాంగ్రెస్–బీఆర్‌ఎస్–బీజేపీ మధ్యే ప్రధాన పోటీ
చాలా చోట్ల ద్విముఖ, కొన్ని చోట్ల త్రిముఖ పోటీ
48 గంటల సైలెన్స్ పిరియడ్ అమల్లోకి
13న తేలనున్న ప్రజా తీర్పు
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అధికారికంగా తెరపడింది. సోమవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార హోరు ముగియడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా శాంతించింది. జిల్లాలోని 12 మున్సిపాలిటీల పరిధిలో చివరి రోజు ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను తలపించే రీతిలో హోరెత్తింది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు, భారీ రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా భూపాలపల్లిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన రోడ్ షో ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రచారం ముగిసిన వెంటనే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మైకులు మూగబోయాయి. పోలింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి బహిరంగ ప్రచార కార్యక్రమాలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. 48 గంటల సైలెన్స్ పిరియడ్ కూడా అధికారికంగా అమల్లోకి వచ్చింది.
12 మున్సిపాలిటీల్లో హోరాహోరీ పోరు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, భూపాలపల్లి, జనగామ, వర్ధన్నపేటతో పాటు కొత్తగా ఏర్పడిన కేసముద్రం, స్టేషన్ ఘనపూర్, ములుగు, మున్సిపాలిటీల్లో ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 260 వార్డులకు పోలింగ్ నిర్వహించనుండగా, పట్టణాభివృద్ధి, తాగునీటి సమస్యలు, డ్రైనేజీ, రహదారులు, ఉపాధి అవకాశాలు వంటి అంశాలు ప్రచారంలో ప్రధాన అజెండాగా నిలిచాయి. ఈ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 1,072 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 249 మంది, బీఆర్ఎస్ నుంచి 259 మంది, బీజేపీ నుంచి 238 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, మిగతావారు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. చాలా వార్డుల్లో ద్విముఖ పోటీ నెలకొనగా, కొన్ని ప్రాంతాల్లో త్రిముఖ పోటీ కూడా కనిపిస్తోంది. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో పోలింగ్ శాతం ఎలా ఉండబోతుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మహబూబాబాద్, నర్సంపేట, జనగామ వంటి మున్సిపాలిటీల్లో రెబల్ అభ్యర్థుల బెడద ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది. ఈ రెబల్స్ ఓట్ల చీలికకు కారణమై ఫలితాలను తారుమారు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ బీసీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని వ్యూహాలు రచించాయి. 43 శాతం రిజర్వేషన్ల డిమాండ్ నేపథ్యంలో బీసీ వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రత్యేక హామీలు ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాల అమలును ప్రధానంగా ప్రస్తావించగా, బీఆర్ఎస్ గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని ఎత్తిచూపింది. ప్రభుత్వం మున్సిపల్ అభివృద్ధికి ఉమ్మడి జిల్లాలో రూ.6,116 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారంలో ప్రకటించింది.
పోలింగ్‌కు సిద్ధమైన యంత్రాంగం
ఫిబ్రవరి 11, 2026న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, ఫలితాలు ఫిబ్రవరి 13న వెల్లడించనున్నారు. ప్రచారం ముగియడంతో ఎన్నికల యంత్రాంగం పూర్తిగా పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించింది. పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు నిరంతర గస్తీ నిర్వహిస్తున్నాయి. నగదు పంపిణీ, మద్యం, బహుమతుల పంపకం వంటి ప్రలోభాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. హోరెత్తిన ప్రచార పర్వం ముగియడంతో ఇప్పుడు ఓటర్ల నిర్ణయమే అత్యంత కీలకంగా మారింది. పట్టణాల అభివృద్ధిపై ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్ ద్వారా స్పష్టమవనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ మున్సిపల్ ఎన్నికలు రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఫలితాలు అధికార పార్టీల భవిష్యత్ వ్యూహాలకు దిశానిర్దేశం చేయనున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరి 13న వెలువడే ప్రజా తీర్పుపైనే కేంద్రీకృతమైంది.


