ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణం
ప్రలోభాలకు లొంగకండి – స్వేచ్ఛగా ఓటేయండి
నర్సంపేటలో అవగాహన ర్యాలీ నిర్వహణ
కాకతీయ, నర్సంపేట : ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే పునాదిగా నిలుస్తుందని, బాధ్యతాయుతంగా ఓటు వేయడమే నిజమైన పౌర కర్తవ్యమని ఆమె అన్నారు. సోమవారం నర్సంపేట పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించిన ఓటరు అవగాహన ర్యాలీలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓటర్లు డబ్బు, మద్యం, ఇతర కానుకల వంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు, అధికారులు ప్లకార్డులు పట్టుకుని “నిర్భయంగా ఓటేయండి”, “ప్రలోభాలకు తలొగ్గకండి” అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించి ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్వీప్ జిల్లా నోడల్ అధికారి పెద్దిరెడ్డి భాగ్యలక్ష్మి, ఆర్డీఓ ఉమా, మున్సిపల్ కమిషనర్ భాస్కర్, తహసీల్దార్ రవిచంద్ర రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.


