ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి
తొర్రూర్ ఆర్డీవో గణేష్ ఆదేశాలు
కాకతీయ, మరిపెడ : మున్సిపాలిటీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సమర్థవంతంగా నిర్వహించాలని తొర్రూర్ ఆర్డీవో జి. గణేష్ అధికారులకు సూచించారు. సోమవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తహసిల్దార్ కొండపల్లి కృష్ణవేణితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, త్రాగునీటి సదుపాయాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వికలాంగ ఓటర్ల కోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండి తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ఈ పరిశీలనలో ఎంపీడీవో బి.వేణుగోపాల్ రెడ్డి, ప్రొసీడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రొసీడింగ్ అధికారులు పాల్గొన్నారు.


