ఎన్నికల నిబంధనలు కఠినంగా అమలు
పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్
కాకతీయ, రామకృష్ణాపూర్ : ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సూచించారు. సోమవారం రామకృష్ణాపూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్లు తమ ఓటర్ స్లిప్ ఆధారంగా కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లోనే ఓటు వేయాలని తెలిపారు. సోమవారం సాయంత్రం నుంచి ఈ నెల 13వ తేదీ సాయంత్రం వరకు 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కాలంలో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు నియోజకవర్గ పరిధిలో ఉంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో వంద మీటర్ల వరకు ఈ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. సమావేశంలో మందమర్రి సీఐ రమేష్, ఎస్సైలు శ్రీధర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


