కరీంనగర్‌లో బీజేపీ ఏకపక్ష విజయం ఖాయం
66 డివిజన్లలో 45 స్థానాలు గెలుస్తాం
మేయర్ పీఠం దక్కితే ప్రజలకు రక్షణ కవచం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగా మారాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మొత్తం 66 డివిజన్లలో బీజేపీ 45 స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే కరీంనగర్ ప్రజలకు రక్షణ కవచంగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రచార చివరి రోజు తీగలగుట్టపల్లి, చింతకుంట ప్రాంతాల్లో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల ఆలస్యానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కేంద్రం నుంచి రూ.154 కోట్ల నిధులు మంజూరు చేయించానని, రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసిందన్నారు.
అమృత్ 2.0 పథకం కింద రూ.132 కోట్లతో తాగునీటి పనులు జరుగుతున్నాయని, ఈ నిధులు పూర్తిగా తానే తీసుకొచ్చినవేనని తెలిపారు. పద్మానగర్ పార్కు పనులు నిర్లక్ష్యంతో ఆగిపోయాయని, బీజేపీ మేయర్ గెలిచిన వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ అభివృద్ధి కొనసాగాలంటే బీజేపీకి ఓటేయాలని, డబ్బులకు లొంగకుండా ప్రజలు చైతన్యంతో నిర్ణయం తీసుకోవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.


