బీఆర్‌ఎస్‌కు మద్దతివ్వండి
ములుగును అభివృద్ధి చేసింది కేసీఆరే
కాంగ్రెస్ వైఫల్యాలకు ఓటుతో సమాధానం ఇవ్వాలి
పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. ములుగు జిల్లాను ఏర్పాటు చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది మాజీ సీఎం కేసీఆర్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. సమ్మక్క–సారలమ్మ జాతరకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం రావడంలో కేసీఆర్ ప్రభుత్వ కృషి ఉందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణంలో పారిశుధ్యం, తాగునీరు, గృహ సమస్యలు తీవ్రంగా పెరిగాయని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో 5 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, రైతు బంధు, రైతు భీమా పథకాలు సమర్థంగా అమలయ్యాయని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేక ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ములుగు జిల్లాను రద్దు చేసే కుట్ర జరుగుతోందని, దీనిపై మంత్రి సీతక్క స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నిక సామాన్య ప్రజలు–కాంగ్రెస్ నాయకుల మధ్య పోరాటమని, ములుగు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ జెండా ఎగరేలా ఓటర్లు సహకరించాలని లక్ష్మణ్ బాబు కోరారు.


