ములుగులో ముగిసిన ప్రచార పోరు
త్రిముఖ పోటీలో ఉత్కంఠ.. ఓటరు తీర్పుపై ఆసక్తి
11న పోలింగ్‌కు స్థానిక సెలవు.. మొదలుకానున్న నిశ్శబ్ద రాజకీయం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సోమవారంతో అధికారికంగా ముగిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొనగా చివరి రోజు వరకు హోరాహోరీ ప్రచారం సాగింది. అన్ని వార్డుల్లో అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. మంత్రి సీతక్క సొంత నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆమె స్వయంగా వార్డులన్నింటిలో పర్యటించి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రస్తావిస్తూ ఓటర్ల మద్దతు కోరారు. బీఆర్ఎస్ తరఫున ఎన్నికల ఇన్చార్జ్ సత్యవతి రాథోడ్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు, నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీజేపీ తరఫున ఎంపీ ఈటల రాజేందర్ ప్రచారంలో పాల్గొని పార్టీ అభ్యర్థులకు ఊతమిచ్చారు. ప్రచారం ముగిసిన తర్వాత నిశ్శబ్ద కాలంలో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన నిఘా అవసరమని ప్రజలు కోరుతున్నారు. పోలింగ్ సందర్భంగా ఈ నెల 11న స్థానిక సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ దివాకర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక ములుగు మున్సిపాలిటీ భవితవ్యాన్ని ఓటరు తీర్పే నిర్ణయించనుంది.


