మృతి చెందినా చలనం లేదు
ఫ్లెక్సీతో ప్రభుత్వానికి రిటైర్డ్ ఉద్యోగి ప్రశ్న
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల వేళ కరీంనగర్‌లో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఓ రిటైర్డ్ ఉద్యోగి చేపట్టిన వినూత్న నిరసన రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. సమస్య చెప్పుకునేందుకు సభలు, ర్యాలీలు కాకుండా తన ఇంటి గోడపైనే ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని నేరుగా నిలదీశారు. 2024లో పదవీ విరమణ చేసినప్పటికీ 23 నెలలు గడిచినా తన పెన్షన్ బకాయిలు చెల్లించలేదని ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ బకాయిలు అందక మానసిక వేదనతో ఇప్పటికే 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు మృతి చెందినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు ఇవ్వలేని ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఓటు అడగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది ఒక్క వ్యక్తి సమస్య కాదని, వేలాది రిటైర్డ్ ఉద్యోగుల బాధను ప్రతిబింబించే గోడ నిరసనగా పేర్కొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎన్నికల హామీల హోరులో పెన్షన్ బకాయిలపై ప్రభుత్వ మౌనాన్ని ఈ నిరసన తేటతెల్లం చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


