బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
క్యాతన్‌పల్లిలో బాల్క సుమన్ ప్రచారం
కాంగ్రెస్ హామీలు అమలుకాలేదని విమర్శ
కాకతీయ, రామకృష్ణాపూర్ : బీఆర్ఎస్–సీపీఐ పొత్తులో బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14, 15, 22 వార్డుల్లో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు 420 హామీలుగానే మిగిలిపోయాయని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి పనులనే చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. క్యాతన్‌పల్లి ప్రాంత అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.


