బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
కాంగ్రెస్ పాలనపై సినీ రచయిత మిట్టపల్లి సురేందర్ విమర్శలు
కాకతీయ, స్టేషన్ ఘనపూర్ : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రముఖ సినీ గేయ రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు మిట్టపల్లి సురేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్టేషన్ ఘనపూర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరుకాగా, మిట్టపల్లి సురేందర్ తన పాటలతో జనాన్ని ఉత్సాహపరిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలను చిన్న ఎన్నికలుగా చూడొద్దని, రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు ఇవే ఆరంభం కావాలని సూచించారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రచారానికి రావడం అంటే స్వయంగా కేటీఆర్ రావడమేనని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలని ఆయన ఓటర్లను కోరారు. కార్యక్రమంలో తాటికొండ రాజయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


