ఎన్నికల ప్రచారంలో డిజిటల్ హోరు
నర్సంపేటలో వాట్సాప్ ప్రచారమే నయా ట్రెండ్
త్రిముఖ పోటీలో 120 మంది అభ్యర్థులు
కాకతీయ, నర్సంపేట టౌన్ : నర్సంపేట మున్సిపల్ ఎన్నికలు సమీపించడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొనగా, 30 వార్డులకు గాను మొత్తం 120 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో పట్టణమంతా ఎన్నికల హడావిడితో సందడిగా మారింది. ఈసారి ప్రచార సరళిలో పూర్తిగా కొత్తదనం కనిపిస్తోంది. సంప్రదాయ ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలతో పాటు సోషల్ మీడియా ప్రచారం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులు ఎన్నికల ప్రచారానికి కీలక వేదికలుగా మారాయి. అభ్యర్థుల ఫొటోలు, వీడియోలు, ప్రచార షెడ్యూల్స్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. పట్టణంలో వందల సంఖ్యలో ప్రెస్ వాట్సాప్ గ్రూపులు, పార్టీ గ్రూపులు యాక్టివ్‌గా ఉండటంతో సమాచారం వేగంగా ప్రజల్లోకి చేరుతోంది. మూడు ప్రధాన పార్టీలు డిజిటల్ ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టి వ్యూహాలు అమలు చేస్తున్నాయి. సమావేశాలు, రోడ్‌షోలు, హామీల వివరాలు వాట్సాప్ ద్వారానే ఓటర్లకు చేరుతున్నాయి. ఈ నెల 11న పోలింగ్, 13న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రచారం మరింత ఉత్కంఠగా సాగుతోంది. సంప్రదాయ ప్రచారంతో పాటు డిజిటల్ ప్రచారమే ఈ ఎన్నికల్లో ప్రధాన ఆయుధంగా మారిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నర్సంపేటలో విజయం ఎవరిని వరిస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.


