కరీంనగర్‌లో కాంగ్రెస్ ప్రచార హోరు
ఇంటింటి ప్రచారం.. ర్యాలీల్లో పాల్గొన్న మంత్రులు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తోంది. డివిజన్‌లవారీగా ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌లతో ప్రజలను నేరుగా కలుస్తూ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా రంగంలోకి దిగి అభ్యర్థులకు అండగా ప్రచారాన్ని నడిపిస్తున్నారు. 50వ డివిజన్ జ్యోతి నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రాచకొండ చక్రధర్‌రావుకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. చక్రధర్‌రావు ప్రజల్లో సుపరిచిత నాయకుడని, సేవాభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. గత పదేళ్లుగా కరీంనగర్ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే డంపింగ్ యార్డు, డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపిస్తేనే పట్టణానికి నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల సమస్యలు పేరుకుపోయాయని, కాంగ్రెస్‌తోనే వాటికి పరిష్కారం లభిస్తుందని అన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం చేతి గుర్తుకు ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


