కాంగ్రెస్ దొంగల.. లంగల పార్టీ!
ఆరు గ్యారంటీల అమలుపై కేటీఆర్ ధ్వజం
నర్సంపేటలో బీఆర్ఎస్ భారీ ర్యాలీ, రోడ్‌షో
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో ప్రచారం
మున్సిపల్ ఎన్నికల్లో గట్టి తీర్పు ఇవ్వాలని పిలుపు
కాకతీయ, నర్సంపేట : కాంగ్రెస్ పార్టీ స్టువర్టుపురం దొంగల లంగల పార్టీగా మారిందని, అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలను పూర్తిగా మరిచిపోయిందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నర్సంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన భారీ ర్యాలీ, రోడ్‌షో కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. పట్టణంలోని 30 వార్డుల్లోనూ బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా సాగిన ఈ ప్రచారంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఎన్నికల ముందు వర్షంలా హామీలు కురిపించిన సీఎం రేవంత్‌రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోని కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.

గ్యారంటీల పేరుతో మోసం
ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. పేదలకు భరోసా లేదని, రైతులకు సరైన న్యాయం జరగలేదని, యువతకు ఉద్యోగాలు లేక నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని, పాలన దిశదశ తప్పిందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి కాంగ్రెస్ నాయకులు అధికార మత్తులో మునిగిపోయారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పాలనతో పోలిక
బీఆర్ఎస్ హయాంలో నర్సంపేట ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసని కేటీఆర్ గుర్తుచేశారు. రోడ్లు, తాగునీరు, మౌలిక వసతుల కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కీలకంగా పనిచేసిందని వివరించారు. కానీ కాంగ్రెస్ చేతుల్లోకి రాష్ట్రం వెళ్లాక అభివృద్ధి వెనుకబడిపోయిందని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఈ మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నర్సంపేట నుంచే కాంగ్రెస్ పతనానికి నాంది పలకాలని కేటీఆర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ప్రజలు తమ అసంతృప్తిని చాటాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నియోజకవర్గ కన్వీనర్ తక్కల్లపల్లి రవీందర్‌రావు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, గటికే అజయ్‌కుమార్‌తో పాటు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణ నాయకులు, మాజీ ఎంపీపీలు, సర్పంచులు, మహిళా నాయకులు, యువకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ శ్రేణుల హోరాహోరీ నినాదాలతో నర్సంపేట పట్టణం కారు గుర్తు ప్రచారంతో హోరెత్తింది.


