కరీంనగర్‌లో ఫ్లాగ్ మార్చ్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల్లో విశ్వాసం కల్పించడం కోసం కిసాన్ నగర్, సుభాష్ నగర్, శివాజీ నగర్, బుట్టిరాజారామ్ కాలనీల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తిరుమల్ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి ప్రాంతాల్లోని పరిస్థితిని సమీక్షించారు. ఎన్నికల సమయంలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఫ్లాగ్ మార్చ్‌లో భాగంగా సాధారణ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఆదర్శ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ )పై అవగాహన కల్పించారు. ఎన్నికల మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, శాంతి భద్రతలను కాపాడుకోవాలని, ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు.


