కాంగ్రెస్ విజయం ఖాయం
ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా
కాకతీయ, మెట్‌పల్లి: మున్సిపల్ ఎన్నికల్లో వందశాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల పరిధిలో మంత్రి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనకు ప్రజల నుంచి పాజిటివ్ స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో అధికార పార్టీకి లోకల్ బాడీ ఎన్నికల్లో ఇలాంటి అనుకూల వాతావరణం రావడం చాలా అరుదని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజల ముందు చెప్పుకునే విషయాలే లేవని విమర్శించారు. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న దృష్ట్యా, తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీగా నిధులు వెచ్చిస్తామని హామీ ఇచ్చారు. పట్టణాభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు.


