చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
ప్రచారంలో బహిరంగ నిలదీత, వీడియో వైరల్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో: చొప్పదండి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రచారంలో ఉన్న ఆయనను కల్లపెల్లి కోమలత–మహేష్ దంపతులు నేరుగా నిలదీశారు. గతంలో టికెట్ ఇస్తామని నమ్మబలికి ఇప్పుడు మోసం చేశారని ఆరోపిస్తూ బహిరంగంగానే ప్రశ్నల వర్షం కురిపించారు. తమకు జరిగిన అన్యాయంపై వివరణ ఇవ్వాలని ఆగ్రహంతో మాట్లాడిన వారు “అంత చాతకానోడివి ఎందుకు పిలిచావ్ రా నన్ను? ఇంట్లో ఉన్న మమ్మల్ని బయటకు లాగి రోడ్డు మీద వేశావు. మొఖం లేనోడివి, ఇక్కడ మాట్లాడడానికి వచ్చావా? అంటూ ఫైర్ అయ్యారు. ఘాటు పదజాలంతో నిలదీయడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మాజీ ఎమ్మెల్యే అక్కడి నుంచి తల దాచుకుని వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల ప్రచార వేళ చోటు చేసుకున్న ఈ బహిరంగ నిలదీత చొప్పదండి రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతోంది.


