కరీంనగర్ టు కాఠ్మండు
మూడేళ్ల కింద మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు
కాకతీయ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు సంవత్సరాల క్రితం మిస్సింగ్ కేసు నమోదైన వ్యక్తిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గోదావరిఖని గౌతమీనగర్కు చెందిన పస్తం సురేష్ (32) భార్య అనూషతో ఉన్న గొడవల కారణంగా మూడేళ్ల క్రితం అత్తవారి ఇంటి (దుర్షేడ్ గ్రామం) నుంచి కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన కరీంనగర్ రూరల్ పోలీసులు నిరంతరంగా దర్యాప్తు కొనసాగించారు. తొలుత విశాఖపట్నంలో, అనంతరం నేపాల్ దేశంలోని కాఠ్మండు ప్రాంతంలో నివసిస్తున్నట్లు గుర్తించారు. ఆధునిక సాంకేతికత ఆధారంగా సమర్థవంతమైన ఫాలోఅప్ ద్వారా పోలీసులు కాఠ్మండులో అతడిని ట్రేస్ చేశారు. ఇన్స్పెక్టర్ ఎ. నిరంజన్ రెడ్డి పర్యవేక్షణలో సాంకేతికత ఆధారంగా విజయవంతంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.


