ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం
ఎన్‌సీసీ సేవలను ప్రశంసించిన జిష్ణు దేవ్ వర్మ
విద్యాసంస్థల్లో ఎన్‌సీసీకి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని పిలుపు
కాకతీయ, హైదరాబాద్ : గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రిపబ్లిక్ డే పరేడ్–2026లో తెలంగాణ తరఫున న్యూఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన ఎన్‌సీసీ అధికారులు, కేడెట్లను శనివారం లోక్ భవన్‌లో ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. దేశ నిర్మాణంలో యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ చేస్తున్న సేవలు అమూల్యమైనవని ఆయన పేర్కొన్నారు. ఎన్‌సీసీ శిక్షణ శిబిరాలు కేడెట్లలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ నైపుణ్యాలు, క్రమశిక్షణ వంటి గుణాలను పెంపొందిస్తాయని గవర్నర్ తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే భావనను యువతలో బలంగా నాటేందుకు ఎన్‌సీసీ కార్యక్రమాలు దోహదపడుతున్నాయని ఆయన అన్నారు. విద్యాసంస్థలు తమ విద్యార్థులను ఎన్‌సీసీ కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొనేలా ప్రోత్సహించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు అలవడితే, భవిష్యత్తులో సమాజానికి ఉత్తమ సేవకులుగా మారతారని ఆయన అభిప్రాయపడ్డారు.
రిపబ్లిక్ డే పరేడ్‌లో తెలంగాణ తరఫున పాల్గొని ప్రతిభ కనబరిచిన కేడెట్లకు, అలాగే వారి వెంట ఉన్న సీనియర్ ఎన్‌సీసీ అధికారులకు గవర్నర్ జ్ఞాపికలను అందజేసి అభినందించారు. వారి కృషి రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎన్. సైలాని, ఇతర సీనియర్ ఎన్‌సీసీ అధికారులు, లోక్ భవన్ అధికారులు పాల్గొన్నారు.


