బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర!
దొడ్డిదారిన నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం
నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టొద్దు.. మెరిట్‌కే అవకాశం ఇవ్వాలి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కాకతీయ, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తూ బ్యాక్‌డోర్ ద్వారా ఉద్యోగ నియామకాలకు కుట్ర పన్నుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టుల పేరుతో పరీక్షలు లేకుండా దొడ్డిదారిన నియామకాలు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి పలువురు నిరుద్యోగులు తనను కలిసి ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేశారని కవిత తెలిపారు. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ వంటి పోస్టులను పైరవీలతో భర్తీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారం అందిందని చెప్పారు. ఇది నిరుద్యోగ యువతకు తీవ్రమైన అన్యాయం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన యువతకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో కాంగ్రెస్‌కు ఓట్లు వేయించారని, కానీ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. గ్రామాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్న యువత ఆశలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో కొన్ని చోట్ల అక్రమ నియామకాలు జరిగాయని, నిర్మల్ జిల్లాలో 44 పోస్టులు డబ్బులకు అమ్ముకున్న ఘటన వెలుగులోకి వచ్చిందని గుర్తుచేశారు. అప్పట్లో యువత పోరాటంతో ఆ నియామకాలు ఆగిపోయాయని, కానీ ఇప్పుడు అదే తరహా దందా కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ మొదలవుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి అక్రమ నియామకాలను వెంటనే నిలిపివేయాలని, పారదర్శక విధానంలో మాత్రమే ఉద్యోగాలు భర్తీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. కలెక్టర్లు తమ పరిధిలో జరిగే నియామకాలను పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన నిర్వహించేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. “డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకునే ప్రయత్నాలు ఎవరు చేయొద్దు. భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తే ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మెరిట్ ఉన్న నిరుద్యోగులకు తెలంగాణ జాగృతి ఎప్పటికీ అండగా నిలుస్తుంది” అని ఆమె స్పష్టం చేశారు.
నిరుద్యోగుల ఆశలను వమ్ము చేసే దొడ్డిదారి నియామకాలపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కవిత హెచ్చరించారు.


