కాంగ్రెస్‌కు ‘కర్రుకాల్చి వాత’ పెట్టాలి!
బీఆర్‌ఎస్ పాలనకు–కాంగ్రెస్ పాలనకు ఆకాశానికీ భూమికీ తేడా
రెండున్నరేళ్లలో ఒక్క శాశ్వత పని చూపగలరా?
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కాకతీయ, పరకాల : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉందని వారు విమర్శించారు. పరకాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిరికొండ మాట్లాడుతూ, అమలుకాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రెండున్నరేళ్లలో పరకాలకు ఒక్క శాశ్వత అభివృద్ధి పని కూడా చేయలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి పరకాలకు రూపాయి నిధి అయినా మంజూరు చేశారా? అని నిలదీశారు.
కేసీఆర్ హయాంలో పరకాల రూపురేఖలు మారాయని, రోడ్లు, ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కాలేజీ వంటి అభివృద్ధి పనులు బీఆర్‌ఎస్ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మంజూరైన పనులకు శిలాఫలకాలు మార్చి తామే చేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని, ప్రజలకు చేసింది శూన్యమని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే పరకాలకు నిజమైన అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఈ నెల 9న కేటీఆర్ పరకాల రానున్నారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేతలు కోరారు.


