పరకాల అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం
అధికార పార్టీని గెలిపిస్తే అభివృద్ధి వేగవంతం
అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పన
ప్రజల ఆశీర్వాదంతో సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తా
ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, పరకాల : పరకాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన, ప్రజలతో నేరుగా మాట్లాడి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే పట్టణానికి మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులను సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ప్రజలదేనని పేర్కొన్నారు. పట్టణాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని ఎమ్మెల్యే తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ప్రజల రోజువారీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వివరించారు.
పట్టణానికి పలు కీలక ప్రాజెక్టులు
పరకాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, నూతన డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, మహిళా డైరీ ఏర్పాటు, దామెర చెరువు సుందరీకరణ వంటి అనేక అభివృద్ధి పనులు ఇప్పటికే చేపట్టామని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అన్ని వర్గాల సంక్షేమమే తమ ప్రాధాన్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఓట్ల కోసం మాత్రమే వచ్చే టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మాయమాటలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


