8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా నల్లెల్ల స్వాతి ప్రచారం
కుటుంబ సేవలే తన బలం
అభివృద్ధే లక్ష్యం అని హామీ
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు మున్సిపాలిటీ 8వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా నల్లెల్ల స్వాతి ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి దీర్ఘకాలంగా సేవలందించిన దివంగత నేత, జిల్లా మాజీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి కోడలైన స్వాతి, కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. శనివారం ఉదయం 8వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆమెకు స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ 2014 నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన తన మామ నల్లెల్ల కుమారస్వామి ఆశయాలే తనకు మార్గదర్శకమని పేర్కొన్నారు. గతంలో 1995–2001 మధ్య సర్పంచ్‌గా, 2001–2006 మధ్య ములుగు ఎంపీపీగా నల్లెల కుమారస్వామి చేసిన సేవలు, అలాగే 2006–2011 మధ్య నల్లెల్ల కుమారస్వామి భార్య విజయ సర్పంచ్‌గా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఇప్పటికీ గుర్తుండేలా ఉన్నాయని చెప్పారు. ఆ కుటుంబంపై ఉన్న ప్రజల విశ్వాసం, ప్రేమ తనకు కూడా లభిస్తుందని ప్రచారంలో ప్రజల స్పందన చూస్తే స్పష్టమవుతోందన్నారు. ఎనిమిదో వార్డు ప్రజలు నన్ను కౌన్సిలర్‌గా గెలిపిస్తే, మున్సిపాలిటీ చైర్మన్ పదవికి కూడా అవకాశం కల్పించినవారవుతారు అని, ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను అని హామీ ఇచ్చారు. ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని స్వాతి కోరారు.


