సిరిసిల్లలో జనసేన ఎంట్రీ..!
మున్సిపల్ ఎన్నికల బరిలో పార్టీ అభ్యర్థులు
యువ, చదువుకున్న అభ్యర్థులు పోటీలో
సిరిసిల్లలో 7 – వేములవాడలో 5 వార్డుల్లో పోటీ
ఇంటింటి ప్రచారంతో పెరుగుతున్న మద్దతు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన పార్టీ తొలిసారిగా అడుగుపెట్టింది. రాజకీయ ప్రయోజనాలకన్నా ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా పోటీ చేస్తున్నామని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని, స్థానిక సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్నామని అభ్యర్థులు చెబుతున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఏడు వార్డులు, వేములవాడ మున్సిపాలిటీలో ఐదు వార్డుల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ రెండు పట్టణాల్లోనూ యువత, విద్యావంతులను బరిలో నిలపడం ద్వారా కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నామని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

పోటీకి యువత.. చదువుకున్న అభ్యర్థులు
జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులంతా ఎక్కువగా యువకులు, విద్యావంతులే కావడం ఈ ఎన్నికల్లో ప్రత్యేకతగా మారింది. అనుభవజ్ఞుల రాజకీయాలకంటే సేవాభావం, పారదర్శకత, ప్రజలతో అనుబంధానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని జనసేన నాయకత్వం చెబుతోంది. స్థానిక సమస్యలపై స్పష్టమైన అవగాహనతో, అవినీతిరహిత పాలన అందించడమే తమ లక్ష్యమని అభ్యర్థులు ఓటర్లకు వివరిస్తున్నారు. “రాజకీయమే కాదు – సేవే మా మార్గం” అనే నినాదంతో ప్రచారం కొనసాగిస్తున్నారు.
సిరిసిల్ల 15వ వార్డు నుంచి జనసేన తరఫున పోటీ చేస్తున్న గడ్డం విజయ ఎన్నికల్లో పోటీ చేయడంపై పట్టణంలో ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఆమె గతంలో మున్సిపల్ కార్మికురాలిగా పని చేశారు. ప్రజా సమస్యలను దగ్గరగా చూసిన అనుభవంతో, మరింత మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగారు. సాధారణ కార్మికురాలిగా మొదలై ఇప్పుడు ప్రజాప్రతినిధిగా మారాలన్న ఆమె ప్రయత్నం స్థానికంగా జనసేనకు సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చింది.
విస్తృత ప్రచారం..!
జనసేన అభ్యర్థులు సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. యువతతో సమావేశాలు, స్థానిక సమస్యలపై చర్చలు, మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ప్రత్యేకంగా యువత నుంచి మంచి స్పందన లభిస్తోందని, కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా జనసేన వైపు ప్రజలు చూస్తున్నారని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
సిరిసిల్ల మున్సిపాలిటీలో 7 వార్డులు, వేములవాడ మున్సిపాలిటీలో 5 వార్డుల్లో జనసేన అభ్యర్థులు బరిలో ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ రాజకీయ సిద్ధాంతాలు, సేవాభావమే తమకు మార్గదర్శకమని జనసేన అభ్యర్థులు చెబుతున్నారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని, ఈ ఎన్నికల ద్వారా సిరిసిల్ల–వేములవాడ ప్రాంతాల్లో కొత్త రాజకీయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో జనసేన ముందుకు సాగుతోంది.
సిరిసిల్ల మున్సిపల్ – జనసేన అభ్యర్థులు
13వ వార్డు – డీకొండ అశోక్
11వ వార్డు – నల్లా ప్రవీణ్
15వ వార్డు – గడ్డం విజయ
25వ వార్డు – దాసరి శేఖర్
26వ వార్డు – అన్నారం సాయి కుమార్
34వ వార్డు – సాగల జీవన్
38వ వార్డు – ఎనగందుల లలిత గణేష్
వేములవాడ మున్సిపల్ – జనసేన అభ్యర్థులు
14వ వార్డు – ఎండీ షాదుల్ల
16వ వార్డు – కొలగరి చందు
17వ వార్డు – అడెల్లి హర్షక్
18వ వార్డు – చింతపంటి సాయికృష్ణ
24వ వార్డు – చింతకింది రాజ్ కుమార్


