కాంగ్రెస్ మాయ మాటలు నమ్మొద్దు
హామీలు నెరవేర్చని నేతలకు ప్రజలు గుణపాఠం చెప్పాలి
పరకాలలో గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యం
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం విస్తృత ప్రచారం
కాకతీయ, పరకాల : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పే మాయ మాటలను ప్రజలు నమ్మవద్దని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ నాయకులు మళ్లీ ఓట్ల కోసం వస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం చల్లా ధర్మారెడ్డి, ఎన్నికల కోఆర్డినేటర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరకాల అభివృద్ధి పూర్తిగా బీఆర్ఎస్ పాలనలోనే జరిగిందని స్పష్టం చేశారు. పరకాలకు మున్సిపాలిటీ హోదా, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు అన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమయ్యాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. పరకాల పట్టణాభివృద్ధి కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడం ఒక్కటే మార్గమని తెలిపారు. గులాబీ జెండాను మళ్లీ ఎగరేసి పరకాలలో బీఆర్ఎస్ సత్తా చాటాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ నాయకులు, వార్డు అభ్యర్థులు, మహిళా విభాగం నేతలు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు గుడ్‌బై… బీఆర్ఎస్‌లో చేరికలు
మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి పరకాలలో ఎదురుదెబ్బ తగిలింది. 1వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు పోరండ్ల సత్యం, 18వ వార్డు నాయకుడు ఒంటేరు బాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో వారు గులాబీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విశ్వాసంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఒంటేరు బాబు తెలిపారు. ఈ చేరికలతో పరకాలలో బీఆర్ఎస్ మరింత బలపడిందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.


