ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్‌ను నిలదీయండి
మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దు
మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఎమ్మెల్సీ రవీందర్ రావు పిలుపు
కాకతీయ, హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణం నిజంగా అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కారు గుర్తుకు ఓటు వేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని 6, 7, 8, 18, 19 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వారు ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆ పార్టీ నాయకులను నేరుగా ప్రశ్నించాలని సూచించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మొండిచేయి చూపిందని విమర్శించారు. “ఒకసారి కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయాం. మరోసారి ఆ తప్పు చేయొద్దు” అని వారు ప్రజలకు హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో గారడీ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, ఆ మాటలను నమ్మి ఓటేయొద్దని స్పష్టం చేశారు.
మంత్రి పొన్నంపై తీవ్ర విమర్శలు
మంత్రి పొన్నం ప్రభాకర్‌పై విమర్శలు గుప్పిస్తూ, ఆయనకు మాటలు చెప్పడం తప్ప అభివృద్ధి పనులు చేయడం చేతకాదని అన్నారు. హుస్నాబాద్‌లో నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే మంత్రి ఇంటింటికి తిరిగి ఓట్లు ఎందుకు అడుగుతారని ప్రశ్నించారు. అభివృద్ధి జరిగితే ప్రజలే స్వచ్ఛందంగా ఓట్లు వేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ.2500 భృతి, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు వంటి హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదని గుర్తు చేశారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఈ హామీలపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి పాలకమండలి ఏర్పడితేనే పట్టణ అభివృద్ధి వేగవంతం అవుతుందని వారు తెలిపారు. ప్రజల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గట్టిగా బుద్ధి చెబితేనే ఆరు గ్యారెంటీలు అమలు కావడానికి ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నారు. మాట తప్పిన కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. “హుస్నాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ మాత్రమే సరైన ప్రత్యామ్నాయం. కారు గుర్తుకు ఓటు వేసి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి” అని సతీష్ కుమార్, రవీందర్ రావు ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయా వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులు, స్థానిక పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


